కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో తెలంగాణలో 1,213 కరోనా టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాస్ తెలిపారు. తొలుత శనివారం 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తూనే.. త్వరలోనే 1,213 సెంటర్లకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.గాంధీ దవాఖానలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభిస్తారని, నిమ్స్‌లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రారంభిస్తారని శ్రీనివాస రావు పేర్కొన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టీకా పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 87వేల 983 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యారోగ్య సిబ్బందికి తొలి విడతలో వ్యాక్సిన్ అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 1940 ఆరోగ్య కేంద్రాల్లో తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.ప్రతి కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ వేసేలా ప్రణాళిక రూపొందించారు.వ్యాక్సినేషన్ కోసం వచ్చే సిబ్బందికి ముందుగానే కొవిన్ యాప్ ద్వారా సంక్షిప్త సమాచారం చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్ ప్రక్రియను కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు.