పవర్‌స్టార్ రీఎంట్రీ మామూలుగా లేదుగా..!విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న ‘వకీల్‌సాబ్’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న ‘వకీల్ సాబ్’ టీజర్ రానే వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో పవర్ స్టార్ తొలిసారిగా న్యాయవాదిగా విభిన్న పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లకు విశేషన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా విడుదలైన టీజర్ ఇప్పటివరకూ ఏడు మిలియన్ల వ్యూస్‌తో 7.15 లక్షల లైక్స్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ 1గా దూసుకెళ్తోంది.
మరోవైపు ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమైందని తెలుస్తుండగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం పోటీ ఎక్కువైందని సమాచారం.తొలుత ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం 15 కోట్లకు పైగానే ఆఫర్ చేసిన ఓ ప్రముఖ ఛానల్ అనూహ్యంగా తప్పుకోవడంతో.. ఆ స్థానంలో జీ తెలుగు ఎంటరైందని, 15 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రుతిహాసన్ కనిపించనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి ఈ జోడీ అలరించేందుకు సిద్ధమవుతోంది. హిందీ సూపర్‌హిట్ ‘పింక్’ రీమేక్‌గా ‘వకీల్‌సాబ్’ తెరకెక్కుతోంది.