టాలీవుడ్ యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సలార్’. కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు కేజీయఫ్ యశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజా కార్యక్రమం అనంతరం ప్రభాస్,యశ్ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రసిద్ధ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ప్రభాస్‌కు జంటగా పూజాహెగ్డే నటిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూరుస్తున్నారు.మరోవైపు యశ్ సైతం ‘కేజీయఫ్-2’ విడుదలకు సన్నద్ధమవుతున్నారు.షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రంపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా.. తాజాగా వదిలిన టీజర్ సోషల్ మీడియాలో రికార్డులను క్రియేట్ చేస్తోంది.