అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు అన్ని రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున అల్లర్లు, సాయుధ నిరసనలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తమకు సమాచారం అందిందని ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ సంస్థలు హెచ్చరించాయి. కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సమయం దగ్గరకొస్తున్న నేపథ్యంలో ట్రంప్ అనుచరులు మరోసారి హింసాకాండకు పాల్పడే అవకాశాలున్నాయన్న భయాందోళనలు రేగుతున్నాయి. ట్రంప్‌ని గడువుకు ముందే గద్దె దించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అనుచరులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా, అరిజోనా రాష్ట్రాల్లో తీవ్ర అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.ఇప్పటికే వాషింగ్టన్లో ఆత్యయిక స్థితి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన కూడళ్లు, రెస్టారెంట్లు, చారిత్రక ప్రదేశాలు, ఫెడరల్ భవనాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న అతివాదులే దాడులకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏ క్షణంలోనైనా వీరంతా రోడ్లపైకి వచ్చి ట్రంప్‌నకు మద్దతుగా హింసాకాండ చేపట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.