బైడెన్ బృందంలో భారతీయులకు పెద్దపీట!20 మందికి శక్తివంతమైన పదవులు
అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు..నూతనంగా కొలువుదీరనున్న బైడెన్ యంత్రాంగంలో ఏకంగా 20 మంది భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. దేశ జనాభాలో కేవలం ఒక శాతంగా ఉన్న భారత సంతతి వ్యక్తులకు ఇన్ని కీలక పదవులు దక్కడం ఇదే తొలిసారి..కాగా..ఈ 20లో 17 మంది శ్వేతసౌధంలోనే కావడం మరో విశేషం. అమెరికా తొలి వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్ ప్రమాణం చేయనుండటమే ఓ రికార్డు అయితే.. కొత్త ప్రభుత్వంలో ఇంతమంది భారత-అమెరికన్లు ఉండటం మరో రికార్డు అని చెప్పొచ్చు.
కాగా..అమెరికా దేశ కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కూడా అదే రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు..అలాగే బైడెన్ బృందంలో భారతీయ అమెరికన్ నీరా టాండన్ ‘ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్’ డైరెక్టర్‌గా, అమెరికా సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తి వ్యవహరించనున్నారు. వీరితో పాటు బైడెన్ పాలక వర్గంలో బైడెన్ స్పీచ్ రైటింగ్ బృందం డైరెక్టర్‌గా వినయ్ రెడ్డి, అధ్యక్షుడికి అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా వేదాంత్ పటేల్, జస్టిస్ డిపార్ట్మెంట్ అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా, స్టేట్ డిపార్ట్మెంట్లో అండర్ సెక్రటరీగా ఉజ్రా జాయే, ప్రథమ మహిళ పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగా, ప్రథమ మహిళ ఆఫీస్ డిజిటల్ డైరెక్టర్‌గా గరీమా వర్మ, ప్రథమ మహిళ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రీన్ సింగ్, వైట్‌హౌస్ డిజిటల్ ఆఫీస్ పార్టనర్షిప్ మేనేజర్‌గా అయిషా షాలు బైడెన్ పాలక వర్గంలో చోటు సంపాదించుకున్నారు..