అగ్రరాజ్య చరిత్రలోనే సరికొత్త పాలనను అందించిన అధ్యక్షుడిగా పేరుగాంచిన డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ఇక ముగిసిపోయింది. మరికొన్ని గంటల్లో ఆయన వైట్‌హౌస్‌ను వీడనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన వీడ్కోలు సందేశాన్ని విడుదల చేశారు. చివరి ప్రసంగంలోనూ ఎక్కడా ఆయన బైడెన్ గెలుపును నేరుగా అంగీకరించలేదు.కాగా, నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. తన వీడ్కోలు సమావేశంలో ట్రంప్ ఇలా మాట్లాడారు…
‘అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. ఈవారం కొత్త పాలకవర్గం విధుల్లోకి రానుంది. అమెరికాను సురక్షితంగా, సుభిక్షంగా తీర్చిదిద్దడంలో వారు విజయం సాధించాలని కోరుకుంటున్నా. వారికి మా శుభాకాంక్షలు. ఈ ప్రయాణంలో అదృష్టమూ వారికి తోడుండాలని ప్రార్థిస్తున్నా’ అని బైడెన్ బృందానికి స్వాగతం పలికారు.కాగా..భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 10:30 గంటలకు బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందే ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడి ఫ్లోరిడాలోని తన సొంత ఇంటికి వెళ్లనున్నారు.