ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గురువారం ఉదయం కీలక తీర్పు వెలువరించింది. ఎస్ఈసీ అప్పీల్పై హైకోర్టు ఎదుట రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన హైకోర్టు ఈరోజు తీర్పు ప్రకటించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని హైకోర్టు స్పష్టం చేసింది.కాగా,హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. త్వరలో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని ఎస్ఈసీ వెల్లడించారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని తెలిపారు.