భారత దేశ 72వ గణతంత్ర దినోత్సవం నాడు అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో చారిత్రాత్మక మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మంగళవారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి, మొక్కలు నాటి.. మసీదు నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ నేతలు సహా హిందూ సంఘాల నుంచి ముగ్గురు ప్రతినిధులు పాల్గొన్నారు.
కాగా,ఇండో – ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ గత డిసెంబర్లో మసీదు నమూనాను ఆవిష్కరించింది. సుందరమైన తోట మధ్యలో మసీదు నిర్మాణం చేపడుతున్నారు. మసీదుపై భారీ గాజు గోపురం ఏర్పాటు చేయనున్నారు. బాబ్రీ మసీదు కంటే అనేక రెట్లు గొప్పగా మసీదు నిర్మాణం చేపట్టనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.కాగా,అయోధ్యలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ చారిత్రక తీర్పు వెలువడిన ఆర్నెళ్ల లోపే అక్కడ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరగడం విశేషం.