బిట్రన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత్‌కు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశం రాజ్యాంగానికి జన్మదినమని ఆయన కొనియాడారు. ఈ మేరకు బోరిస్ జాన్సన్ భారత్‌కు ఒక సందేశాన్ని పంపించారు. భారత్ ఈ రోజు 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నది. ఇది అసాధారణమైన రాజ్యాంగానికి పుట్టినరోజు. ఆ అసాధారణ రాజ్యాంగమే భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టింది. భారత్ అంటే నాకు గుండెల నిండా అభిమానం ఉన్నది. ఆ దేశానికి, అక్కడి ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని బోరిస్ జాన్సన్ తన సందేశంలో పేర్కొన్నారు.
అలాగే భారతదేశం జరుపుకొంటున్న గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం చేజారినందుకు బ్రిటన్ ప్రధాని ఒకింత విచారం వ్యక్తం చేశారు. అయితే, త్వరలో భారత్‌కు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. వాస్తవానికి ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు బోరిస్ జాన్సన్ అతిథిగా హాజరుకావాల్సి ఉండగా.. ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు. బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండడంతో అక్కడ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో, కరోనా మహమ్మరిని కట్టడి చేసే చర్యలను బలంగా అమలు చేసేందుకు బోరిస్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.