టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్‌కతా అపోలో ఆస్పత్రి వర్గాలు ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్‌ని విడుదల చేశాయి. ప్రస్తుతం గంగూలీ క్షేమంగా ఉన్నారని.. భయపడాల్సిన పని లేదని వెల్లడించాయి. ఈ రోజు గంగూలీ సాధారణ కార్డియాక్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లారని.. ఆయన రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక గతంలోనే గుండెనొప్పితో బాధపడిన గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే.
గంగూలీ జనవరి 2న ఉదయం ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుండగా వాంతులు, తలనొప్పి, ఛాతినొప్పి వచ్చిందని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్టు గుర్తించారు. ప్రాథమిక యాంజియోప్లాస్టీ చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నచోట స్టంట్ వేశారు. రెండు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మిగతా పూడికలను తొలగించేందుకు మరికొన్ని రోజుల తర్వాత యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.ఆ తర్వాత దాదా ఆరోగ్యం నిలకడగా ఉండటంతో యాంజియోప్లాస్టీ వాయిదా వేయడమే సురక్షితమని డాక్టర్లు భావించినట్టు ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రూపాలీ బసు అప్పట్లో వెల్లడించారు.