విజయవాడ వేదికగా జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది ఆయన సోదరుడు చిరంజీవేనని అన్నారు. కొద్దికాలం సినిమాలు చేయాలని పవన్‌కు ఆయన సూచించారన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, తాను ముగ్గురం మాట్లాడుతున్న సందర్భంలో.. సినిమాలు వదులుకోవద్దని పవన్‌కు చిరు చెప్పారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
అయితే చిరంజీవి రాజకీయ పునరాగమనంపై మీడియా నాదెండ్ల మనోహర్‌ను ప్రశ్నించగా, ఈ విషయాలు పార్టీలో అంతర్గతంగా చర్చించామని.. త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు. అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల జోరు మొదలైన నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకొచ్చేందుకు నాదెండ్ల మనోహర్ వ్యూహాత్మకంగానే చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.