తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించింది.ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, ఏప్రిల్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు, ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలాగే పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి నిర్వహించే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు తెరుచుకోనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ తరగతుల ప్రారంభానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. విడతల వారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో 9, 10 తరగతులను నిర్వహించాలని నిర్ణయించగా ఇంటర్మీడియల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా నిబంధనల మేరకు ఒక రోజు మొదటి సంవత్సరం, మరో రోజు రెండో సంవత్సరం తరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలవడానికి వీలులేకుండా వారంలో మూడు రోజులు మొదటి, మరో మూడు రోజులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు.