పొక్సో చట్టం కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో ఆమెకు శాశ్వత హోదా కల్పించేలా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం జస్టిస్ పుష్ప గనేడివాలా బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్‌లో న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ బెంచ్‌కు ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా ధ్రువీకరించేందుకు జనవరి 20న సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనలు చేసింది. కాగా.. ఇటీవల మైనర్లపై లైంగిక వేధింపుల కేసుల్లో జస్టిస్ పుష్ప కొన్ని సంచలన తీర్పులు వెల్లడించారు.శరీరంపై దుస్తులు తొలగించకుండా బాలికను ఛాతిని తాకితే లైంగిక వేధింపులుగా పరిగణించలేమంటూ జనవరి 19న తీర్పు ఇచ్చారు. దీనిని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఆమె శాశ్వత హోదా అంశంపై కొలీజియం సిఫార్సులను వెనక్కి తీసుకున్నారు.