1.20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కు కింద లెక్క..
కాలుష్య నివారణకు బలమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈ సారి బడ్జెట్లో నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్న లక్ష్యంతో.. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు.దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. వాయు కాలుష్య నివారణకు రూ.2,217 కోట్లు కేటాయించారు.
2.కరోనా వ్యాక్సినేషన్‌కు రూ. 35వేల కోట్లు
కరోనా మహమ్మారితో దేశం స్తంభించిపోయిన వేళ ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్లో పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని కట్టడిచేసే వ్యాక్సినేషన్ ప్రక్రియకు రూ. 35వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలాసీతారామన్ ప్రకటించారు.కరోనాపై పోరులో భాగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం రూ. 35వేల కోట్లు కేటాయిస్తున్నాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 68.6 కోట్ల జనాభాకు డోసుకు రూ. 255 చొప్పున రెండు డోసుల టీకాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం సీతారామన్ వెల్లడించారు.
3.విద్యుత్ రంగంలో సంస్కరణలు
విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురానున్నట్టు నిర్మల తెలిపారు. విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ సంస్థలు తీసుకురానున్నట్టు తెలిపారు. రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. హైడ్రోజన్ ఎనర్జీపై దృష్టి పెట్టనున్నట్టు చెప్పారు. ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ.1,624 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంచుతున్నట్టు చెప్పారు. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరిస్తున్నట్టు తెలిపారు. 2021-22లో బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి కానున్నట్టు తెలిపారు.
4.మిషన్ పోషణ్ 2.0
షౌష్టికాహారం అందరికీ అందించేందుకు మిషన్ పోషణ్ 2.0 చేపట్టనున్నట్టు తెలిపారు. రూ.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి చేయనున్నారు. 13 రంగాల్లో పీఎల్ఐ ప్రోత్సాహకాల కోసం ఖర్చుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఐదేళ్లలో స్వచ్ఛభారత్ 2.0 కోసం రూ.1,41,678 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
5. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పెద్దపీట
కేరళ, అసోం, బెంగాల్, తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసోం, కేరళ, బెంగాల్ లో 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.