తెలుగులో తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కీర్తి సురేష్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రఖ్యాత ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ‘థర్టీ అండర్ థర్టీ’ పేరుతో 30 ఏళ్లలోపు ప్రతిభావంతులైన 30 మంది జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో 28 ఏళ్ల కీర్తి చోటు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 30 సంవత్సరాల లోపు యువతీయువకులు తమ తమ రంగాల్లో అత్యుత్తమ కనబర్చిన 30 మంది జాబితాను షార్ట్ లిస్ట్ చేసి ప్రకటించింది ఫోర్బ్స్ మ్యాగజైన్. ఈ జాబితాలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో కీర్తికి చోటు లభించింది.
కాగా..తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది కీర్తిసురేష్. ప్రతిష్టాత్మక జాబితాలో చోటుదక్కించుకున్నందుకు గర్వంగా ఉందని చెబుతూ ఫోర్బ్స్ ఇండియా సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. ఇదిలావుండగా..కీర్తిసురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తోంది. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ దుబాయ్లో ప్రారంభమయ్యింది.మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్. తమన్ బాణీలు సమకూరుస్తున్నారు.