పశ్చిమబెంగాల్లో వచ్చే ఏప్రిల్/మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. తృణమూల్ కాంగ్రెస్ పదేళ్ల పాలనకు చెక్ పెట్టే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా.. మరో దఫా రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) వ్యూహాలు సిద్ధం చేస్తోంది.ఈ క్రమంలోనే అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ, బీజేపీ మధ్య కొంత కాలంగా మాటలయుద్ధం నడుస్తోంది. టీఎంసీ నుంచి పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు. వీరిలో మంత్రులు, ఎంపీలు ఉన్నారు.
ముఖ్యంగా మమతాబెనర్జీకి అండదండగా ఉన్న సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీతో సహా మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ను వీడారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనే డైమండ్ హార్బర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పి తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో బెంగాల్లో ఈసారి బీజేపీ విజయ ఢంకా మోగించే అవకాశాలు ఉన్నాయని అత్యధికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీ ఓటర్ సర్వే నిర్వహించింది. కాగా..బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. బీజేపీకి 41.6 శాతం దక్కుతాయని సర్వే పేర్కొంది. టీఎంసీకి 36.9% ఓట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 8.4 శాతం, లెఫ్ట్ పార్టీలకు 4.4 శాతం, ఇతరులకు 2.3 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని సీ ఓటర్ సర్వే వెల్లడించింది.