వి.కె. శశికళ.. తమిళనాట అందరికీ తెలిసిన పేరు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా ఎక్కువ గుర్తింపు పొందారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు సీఎం పదవికి తనే అర్హురాలిగా తెరపైకి వచ్చారు. కానీ, రాజకీయ చదరంగంలో ఓడిపోయారు. అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు. ఆమెది ఇక అధ్యాయం ఇక ముగిసింది అని చాలా మంది అనుకున్నారు. కానీ, బెబ్బులిలా మళ్ళీ తిరిగొచ్చారు. కొద్ది రోజుల కిందట జైలు నుంచి విడుదలైన శశికళ ఫిబ్రవరి 8న చెన్నైకి చేరుకున్నారు. బెంగళూరు నుంచి సుమారు 350 కిలోమీటర్ల దూరం వందలాది వాహనాల్లో అనుచరులు, సన్నిహితులు అనుసరిస్తుండగా తమిళనాడులో ఘనంగా అడుగుపెట్టారు. రాజకీయాల్లో ఘనంగా పునరాగమనం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
కాగా,తమిళనాడుకు చేరుకున్న శశికళకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని ఏఎంఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, శశికళ సమీప బంధువు టీటీవీ దినకరన్ వెల్లడించారు. “ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ నాకు ఫోన్ చేశారు. శశికళ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సుదీర్ఘ ప్రయాణం చేసి ఆమె ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు” అని దినకరన్ మీడియాకు వెల్లడించారు.అయితే,శశికళకు రజనీ ఫోన్ చేయడం పట్ల తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. కొద్ది రోజుల క్రితం రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ అనంతనం విరమించుకున్న విషయం తెలిసిందే. మరి శశికళకు రజనీ ఫోన్ చేయడం పట్ల ఏదైనా రాజకీయం ఉందా అనే కోణంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.