ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు,వైఎస్ షర్మిల..తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇందుకు అవసరమైన సన్నాహాలను మంగళవారం నుంచి మొదలు పెడుతున్నారు. తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు, వైఎస్పార్ అభిమానులకు సమాచారం అందించారు.కాగా.. షర్మిల భర్త, బ్రదర్ అనిల్‌కుమార్ ఇటీవల తన ఫేస్బుక్ అకౌంట్లో ‘అదే చోట, అదే పార్టీలో ఉండకుండా సొంత ప్రయత్నం చేస్తాను’ అంటూ ఇంగ్లీష్ లో ఒక పోస్ట్ పెట్టడం తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది
ఇదిలా ఉండగా..షర్మిల లోటస్ పాండ్‌లోని తన నివాసంలో కాసేపట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్సార్ అభిమానులారా తరలి రండి.. అని గతంలో వైఎస్‌తో అనుబంధం ఉన్న నేతలకు, ఆయనతో పని చేసిన వారికి షర్మిల తరఫున ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. షర్మిల ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ అభిమానులు షర్మిల ఇంటికి భారీగా చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై షర్మిల నిర్ణయం తీసుకునున్నారు.