చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇంట్రస్టింట్ మ్యాచ్’ అంటూ ఆ ట్వీట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. చెన్నైలోని కొన్ని ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభించేందుకు ప్రత్యేక విమానంలో వెళ్లిన మోదీ.. చెన్నై చిదంబరం స్టేడియం మీదుగా వెళ్లారు. ఈ క్రమంలోనే చెపాక్ స్టేడియం ఫోటో తీసి ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘చెన్నై స్టేడియంలో జరుగుతున్న హోరాహోరీ మ్యాచ్‌ను ఆకాశం నుంచి చూశాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే..ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ లో సత్తాచాటిన టీమిండియా.. ఇప్పుడు బంతితోనూ ఆదరగొట్టింది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై పర్యాటక జట్టును 150 పరుగుల లోపే కట్టడిచేసింది. టీమిండియా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడిన ఇంగ్లాండ్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రెండో రోజు ఆటలోనూ టీమిండియానే పైచేయి సాధించింది. కాగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(5/43) తన మాయాజాలాన్ని ప్రదర్శించి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఇషాంత్ శర్మ(2/22), అక్షర్ పటేల్(2/40) కట్టుదిట్టంగా బంతులేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఇంకా 195 పరుగులు వెనుకబడి ఉంది.