ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. ఫేస్బుక్ నేతృత్వంలోని వాట్సాప్కు ధీటుగా సరికొత్త దేశీ యాప్ను లాంచ్ చేసింది. వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ప్రైవరీ నిబంధనలతో వినియోగదారులు మరో ప్రత్యామ్నాయం కోసం యోచిస్తున్న తరుణంలో ఈ యాప్ లాంచ్ చేయడం గమనార్హం. అయితే, వాట్సాప్ తరహా ఫీచర్స్తో దేశీయ ఇన్స్టా మెసేజింగ్ యాప్ సందేశ్ (Sandes)ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసింది. గతంలో ప్రభుత్వ అధికారులు అంతర్గత సమాచార మార్పిడి కోసం ఉపయోగించిన గవర్నమెంట్ ఇన్స్టాంట్ మెసేజింగ్ సిస్టం (జిమ్స్)లో కీలక మార్పులు చేసి సందేశ్ యాప్ను తీసుకొచ్చారు.
ఇప్పటి వరకు ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్ను ఇకమీదట సాధారణ ప్రజలు ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకి అందుబాటులో ఉంది. ఐఓఎస్ యూజర్స్ నేరుగా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్, ఐపాడ్లలో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్స్ జిమ్స్ వెబ్సైట్ నుంచి ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి.
అయితే ఈ యాప్ లో ఖాతా తెరిచేందుకు ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఈ-మెయిల్ ఐడీలు ఉన్నవారికి మాత్రమే ఖాతా తెరిచేందుకు అనుమతించారు.
ఈ యాప్ లో ఖాతా తెరిచిన తర్వాత వాట్సాప్ మాదిరిగానే ఛాటింగ్, ఆడియో కాల్స్, వీడియో కాల్స్, ఫైల్, కాంటాక్ట్ షేరింగ్ చెయ్యొచ్చు. యూజర్స్ సమాచార గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా దీన్ని అభివృద్ధి చేశారు.
ఈ యాప్లో ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీ మార్చుకునే అవకాశంలేదు. ఒకవేళ ఫోన్ నంబర్ మార్చుకోవాలంటే పాత ఖాతా డిలీట్ చేసి, కొత్త ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో కొత్తగా ఖాతా తెరవాలి.