మద్రాస్ లో అల్లు రామలింగయ్య గారు ఉంటున్న ఇంటి పై వాటా లో “చిరంజీవి”, స్నేహితుడు సత్యనారాయణను కలుసుకోవడానికి వచ్చి గంభీరంగా మెట్లు ఎక్కుతూ వెళ్ళాడు. చిరంజీవిని చూసిన “కనకరత్నం” గారు “అబ్బాయి ఎవరో బాగున్నాడే” అనుకోవడం, తరవాత సత్యనారాయణను వివరాలు కనుక్కోవడం చక చకా జరిగిపోయాయి. కుల గోత్రాలు కలవడంతో రామలింగయ్య గారికి, కుమారుడు అరవింద్ కి కనకరత్నం గారు మన “చిట్టి” కి చేసుకుంటే ఎలా ఉంటుంది? అని ప్రతిపాదించడం ఒకదాని వెంట ఒకటి జరిగి పోయాయి, అయితే ఈ తంతు చిరంజీవి కి తెలియదు. మొదట్లో రామలింగయ్య గారికి ఇష్టం లేకపోయినా, రాజమండ్రి నుంచి మద్రాస్ కి రైలులో వస్తుండగా చిరంజీవి ప్రవర్తన పదే పదే గుర్తు రా సాగింది. ఒక్కొక్క సారి చిన్న చిన్న సంఘటనలు పెద్ద మలుపులకి కారణమవుతాయి. రామలింగయ్య గారు సరే అన్నారో లేదో రంగం లోకి దూకాడు అల్లు అరవింద్.
నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవి స్థితి గతులు తెలుసుకున్నాక, చిరంజీవి తల్లి తండ్రులతో మాట్లాడటం, “మీరు చూస్తే, నేను చూడనవసరం లేదు” అన్నా వినకుండా పెళ్లి చూపుల తతంగం అన్ని ఒకదాని వెంట ఒకటి జరిగాయి. నిశ్చయ తాంబూలాల కార్యక్రమం మాత్రం డాక్టర్ ఎన్ టి రామ రావు గారు పెద్దరికం వహించగా, తాంబూలాలు మార్చుకున్నారు అల్లు రామలింగయ్య గారు, కొణిదెల వెంకట్ రావు గారు.
కొణిదెల వారి పెద్దబ్బాయి, అల్లు వారి చిన్నమ్మాయి ఒకటవ్వాల్సిన శుభ ఘడియ రానే వచ్చింది. మద్రాస్ రాజేశ్వరి కల్యాణ మండపం లో, మంగళ వాద్యాలు మ్రోగుతుండగా, యావత్ చలన చిత్ర పరిశ్రమ ఆశీర్వదిస్తుండగా, 1980 ఫిబ్రవరి 20వ తేదీన బుధవారం ఉదయం 11గంటల 50 నిమిషాలకి సురేఖ మెడలో మూడు ముళ్లు వేసారు చిరంజీవి.
పెళ్లి అయిన మరుసటి రోజే చిరంజీవి నటించిన “అగ్ని సంస్కారం” విడుదల అయ్యింది. చిరంజీవి, సురేఖ కలసి చూసిన మొదటి సినిమా ఇదే. అన్నట్టు సురేఖ అన్నట్టు పుట్టిన రోజు ఫిబ్రవరి 18. పెళ్లి రోజు ఫిబ్రవరి 20.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆదర్శ దంపతులు, పార్వతీ పరమేశ్వరులు అయినా చిరంజీవి సురేఖ గార్లకు 41 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.