ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ మళ్లీ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నారు. దీంతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండో స్థానానికి పడిపోయారు. ప్రపంచ బిలియనీర్ల ఇండెక్స్‌లో 2021లో తొలి స్థానానికి రావడం ఎలన్‌మస్క్‌కు ఇది రెండోసారి. బ్లూంబర్గ్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం ఎలన్‌మస్క్ సారథ్యంలోని స్పేస్ఎక్స్ కంపెనీలో తాజాగా 850 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టడంతో ఆయన సంపద 199.9 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది. సెక్వ్యియా క్యాపిటల్ సారథ్యంలోని ఇన్వెస్టర్ల గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టింది. ఇక స్పెస్ఎక్స్ కంపెనీ విలువ 74 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2020 ఆగస్టు నుంచి స్పేస్ ఎక్స్ కంపెనీ విలువ 60 శాతం పెరిగింది.
అయితే,గత వారం 194.2 బిలియన్ల డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్.. ఎలన్‌మస్క్‌ను దాటేసి అగ్ర స్థానానికి చేరారు. అంతకుముందు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్లో 1.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఎలన్‌మస్క్ ప్రకటించడంతో దాని విలువ 50 వేల డాలర్లను దాటేసింది. బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన తర్వాత సమీప భవిష్యత్‌లో తమ ఉత్పత్తుల కొనుగోళ్లకు బిట్ కాయిన్‌ను అనుమతించనున్నామని మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే.