కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల కారణంగా ఎన్నో కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై అధ్యయనానికి ఉద్దేశించిన చంద్రయాన్-3 ప్రయోగంలో మరింత వెనక్కు వెళ్లింది. ఈ ప్రయోగాన్ని వచ్చే ఏడాది నిటీవహించే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తాజాగా వెల్లడించారు. ఈ ప్రయోగం వాయిదాకు కరోనా మహమ్మారి కారణమని… భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ సహా అనేక ప్రాజెక్టులపై దీని ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు.
తాజాగా ఓ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ కె.శివన్ మాట్లాడుతూ.. ‘భారత దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్-3 ప్రయోగంపై మేం పనిచేస్తున్నాం.. ఇందులో ఆర్బిటర్ ఉండదు. ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయి. చంద్రయాన్-2లో పంపిన ఆర్బిటర్‌ను దీని కోసం ఉపయోగిస్తున్నాం.. దీనిపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి..దీన్ని 2022 ఏడాది ప్రయోగించే అవకాశం ఉంది’ అని శివన్ వెల్లడించారు. ఇక గగన్‌యాన్ ప్రాజెక్టుకు సన్నాహకంగా తొలి విడతలో నిర్వహించే మానవరహిత అంతరిక్షయాత్ర ఈ ఏడాది డిసెంబరు ఉండొచ్చని శివన్ చెప్పుకొచ్చారు.
ఇదిలావుంటే..ఇస్రో 2019లో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం ఆఖర్లో విఫలమైన సంగతి తెలిసిందే. విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలపై దిగుతుండగా 2.5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా కూలిపోయింది. కాగా, పలు గ్రహాలపైకి వ్యోమనౌకలను పంపాలని ఇస్రో భావిస్తున్న సమయంలో చంద్రయాన్-3ను విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష యాత్రల్లో సత్తా చాటడం ఈ సంస్థకు చాలా కీలకం అని చెప్పొచ్చు.