‘ఉప్పెన’లా వచ్చి తొలి సినిమాతోనే పలువురు సినీ ప్రముఖుల మన్ననలు పొందుతున్నాడు మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రియాలిటీకి దగ్గరగా బ్యూటిఫుల్ ప్రేమకథతో సినీఎంట్రీ ఇవ్వడంతో ప్రతి ఒక్కరి దృష్టి ఇతనిపై పడింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ వైష్ణవ్ తేజ్ నటన, బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాయి.
కాగా, ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా కీలక పాత్ర పోషించాడు. పాటలు, నేపథ్య సంగీతంతో ‘ఉప్పెన’ను దేవి మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో దేవిశ్రీకి మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక బహుమతిని అందించారు. దేవిని అభినందిస్తూ ఓ లేఖను కూడా పంపించారు. ‘డియర్ డీఎస్పీ.. ఎగసిపడిన ఈ ‘ఉప్పెన’ విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతం ఇస్తావో.. కొత్త వారికి కూడా అంతే ఫ్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావు. నీలో ఉండే ఈ ఎనర్జీ, సినిమాలకు నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేమతో చిరంజీవి’ అంటూ మెగాస్టార్ ఆ లేఖలో పేర్కొన్నారు. చిరు బహుమతిని, అభినందన లేఖను దేవి ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఇదిలావుంటే..సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు విడుదల కంటే ముందే ‘ఉప్పెన’ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్‌ను క్రియేట్ చేస్తూ రావడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఈ నెల 12న సినిమా విడుదల కాగా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది.