స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ప్రతి ఏడాది ‘పరాక్రమ దివస్’గా జరపాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. యువతలో స్ఫూర్తి, దేశభక్తిని పెంపొందించేందుకుగానూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది..భారతీయుల ప్రియతమ నేత, దేశం కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించాం. 2021 నుంచి ఆయన జయంతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘పరాక్రమ దివస్’గా నిర్వహించనున్నాం. దేశ ప్రజల్లో ముఖ్యంగా యువతలో స్ఫూర్తిని నింపి వారిలో నేతాజీ వలే దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కేంద్ర సాంస్కృతిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది..
కాగా..ఈ నెల 23న నేతాజీ 125వ జయంతిని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది..పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న బెంగాల్లో పర్యటించనున్నారు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడే తొలి పరాక్రమ దినాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. అదే రోజున బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీకి నివాళిగా పాదయాత్ర నిర్వహించే యోచనలో ఉన్నారు..ప్రస్తుతం బెంగాల్లో ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో నేతాజీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.