పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు అంగీకరిస్తూ.. యంగ్ హీరోలను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పునరాగమనంలో ఈ దూకుడేంటి? అని అంతా ఆశ్చర్యపోయేలా.. వరుస సినిమాలను ప్రకటించడమే కాదు.. షూటింగ్స్‌ను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. పవన్ స్పీడ్ చూస్తుంటే కరోనా లాక్డౌన్ లేకపోతే.. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’తో పాటు, మరో చిత్రాన్ని కూడా ఈ సరికే విడుదలకు రెడీ చేసేవారేమో.. అనిపించేలా అప్డేట్స్ను వదులుతున్నారు.
ఇప్పటికే ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం క్రిష్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. దీని తర్వాత మాలీవుడ్‌లో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఇందులో బిజూ మీనన్ పాత్రను పవన్ చేయనుండగా, పృథ్వీరాజ్ పాత్రను రానా పోషిస్తున్నాడు .కాగా, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నాడు.
అలాగే గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలోను, సైరా నరసింహారెడ్డి ఫేం సురేందర్ రెడ్డి దర్శకత్వంలోను పవన్ కల్యాణ్ సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుండగా, ఇప్పుడు బండ్లగణేష్ నిర్మాణంలో రాక్షసుడు దర్శకుడు రమేష్ వర్మతో సినిమా చేయనున్నాడని సమాచారం.. రమేష్ వర్మ ప్రస్తుతం రవితేజ హీరోగా ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక పవన్ సినిమా పనులు మొదలు పెట్టనున్నాడని తెలుస్తోంది.