ఆడపిల్ల పెళ్లి అంటే ప్రతి ఇంట్లో అదో మహా వైభోగం. తల్లిదండ్రులు తమ బాధ్యతగా కన్న కూతురిని అల్లుడి చేతిలో పెట్టే శుభ గడియ ఓ మెమరబుల్ మూమెంట్. కాకపోతే ఇన్నాళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు పుట్టినింటి నుంచి మెట్టినింట అడుగుపెడుతుంటే ఆ తల్లిదండ్రులు పెట్టుకునే ఆనంద భాష్పాలను వర్ణించడానికి మాటలు చాలవు.ప్రస్తుతం అదే మూడ్‌లో ఉన్నారు మెగాబ్రదర్ నాగబాబు.ఆయన కుమార్తె నిహారిక వివాహం డిసెంబర్ 9వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లాడింది నిహారిక.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు నిహారిక పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.”నా కూతురు నిహారిక అంటే నాకెంతో ఇష్టం. తను నాకో బెస్ట్ ఫ్రెండ్. నాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఆమెతోనే పంచుకుంటాను. మాఇద్దరి మధ్య మాటల్లో చెప్పలేనంత అనుబంధం ఉంది. కాకపోతే, పెళ్లి అయ్యాక మా ఇద్దరి మధ్య మాటలు కొంచెం తగ్గాయి. అయినప్పటికీ తను జీవితంలో కొత్త అంకానికి నాంది పలికినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అని నాగబాబు పేర్కొన్నారు.అంతేకాకుండా నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి గల కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు.నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి చాలా కారణాలున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వేడుకలు తక్కువమందితో మాత్రమే జరగాలనే నిబంధనలు ఉన్నాయి. అందుకే, కేవలం మా కుటుంబసభ్యులు, కొంతమంది స్నేహితులతో ఈ విధంగా ప్లాన్ చేశాం. అని నాగబాబు చెప్పుకొచ్చారు.