దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత దేశమంతా దక్షిణాది సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ క్రమంలో బాహుబలి విజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న దర్శకధీరుడు పూర్తిగా ఆర్ఆర్ఆర్కే అంకితమైపోయాడు. పైగా స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తుండటంతో ప్రేక్షక లోకం ఈ సినిమాపై ఉత్సుకత ప్రదర్శిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది..
అయితే తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్ర బృందం.ఈ ఏడాది అక్టోబర్ 13న చిత్రం విడుదల కానున్నట్టు తెలియజేస్తూ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ బుల్లెట్‌పై దూసుకుపోతుండగా, రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేస్తున్నారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్‌తో పాటు ఇంటర్నేషనల్ స్టార్స్ రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలీవియా మోరిస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సౌత్ స్టార్ సముద్రఖని, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం కానుంది.