స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్లో రానున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో పుష్పపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి.రష్మికా మందన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
కాగా,విభిన్న కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 13న ‘పుష్ప’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలియజేసింది. విడుదల తేదీని తెలియజేస్తూ అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా.. ‘పుష్ప’ స్పెషల్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. `ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి `పుష్ప` సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ‘ఈ ఏడాది మిమ్మల్నందరినీ థియేటర్లలో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సుకుమార్, దేవిశ్రీప్రసాద్‌తో కలిసి మరోసారి హిట్ కొడతానని ఆశిస్తున్నా’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.