‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ స్థాయి ఒక్కసారిగా పెరిగింది. దర్శకులు సైతం ఆయనతో భారీ బడ్జెట్.. పాన్ ఇండియన్ మూవీలు తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ ఎత్తున నిర్మితమవుతోన్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. గుల్షన్ కుమార్ సమర్పణలో టి-సిరీస్ ఫిలింస్, రెట్రోఫిలిస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశుడిగా నటించబోతున్నారు.భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులకు ఇటీవల మొదలుపెట్టిన విషయం తెలిసిందే.విజువల్ ఎఫెక్ట్స్, 3డి యానిమేషన్లో భాగంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఈ చిత్రం కోసం వాడుతున్నారు.
అయితే తాజాగా ‘ఆదిపురుష్’ ఆరంభ్ అంటూ చిత్రయూనిట్ నుంచి వచ్చిన ప్రకటన ప్రభాస్ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది. ఈ రోజు (మంగళవారం) ముంబైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం.కాగా,వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది.ప్రభాస్ కెరీర్లో 22వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.