కరోనా మహమ్మారి కారణంగా గతేడాది దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. కొత్త సంవత్సరం, సంక్రాంతి సీజన్‌తో సినిమాల విడుదల జోరందుకుంది. సంక్రాంతి కానుకగా దాదాపు అరడజన్ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో క్రాక్, మాస్టర్, రెడ్ సినిమాలకు మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల హీరోలందరూ తాము చేస్తున్న చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. సినీ అభిమానులకు ప్రతి నెలా ఇక పండగే. అయితే, ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. మరి ఏ హీరో ఎప్పుడు? ఏ సినిమాతో వస్తున్నారో ఓ లుక్కేద్దామా!
★ ‘జాంబీ రెడ్డి’ (ఫిబ్రవరి 5న విడుదల)
‘అ!, కల్కి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’. బాలనటునిగా అలరించడంతో పాటు ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటించారు. రాజ్‌శేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నారు.
★ఉప్పెన (ఫిబ్రవరి 12న విడుదల)
బుచ్చి బాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. గతేడాది విడుదల కావాల్సిన చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
★FCUK (ఫిబ్రవరి 12న విడుదల)
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో బేబీ సహస్రిత మరో పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్.. చిట్టి.. ఉమ.. కార్తీక్). విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో శ్రీరంజిత్ మూవీస్‌పై దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు.
★చెక్ (ఫిబ్రవరి 19న విడుదల)
నితిన్ హీరోగా రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం చెక్. వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్’ అని టైటిల్ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వస్తుంది.కాగా,ఫిబ్రవరి 19న ‘చెక్’ విడుదలవుతోంది.