రెబల్‌స్టార్ ప్రభాస్ తాజా సినిమా రాధేశ్యామ్. బాహుబలి తరువాత ప్రభాస్ తీస్తున్న సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. వరుస విడుదలవుతున్న రాధేశ్యామ్ మోషన్ పోస్టర్లు, ఫోటోలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే డార్లింగ్ ఈ సినిమాలో తన లుక్‌తో అందరిని కట్టిపడేశాడు. ఇక డార్లింగ్ సరసన మన బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజ కూడా తన అందంతో అందరిని మరోసారి ఆకట్టుకుంది.కాగా..ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘రాధేశ్యామ్’ ప్రీ టీజర్‌ను చిత్రబృందం తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘ఓ సమరయోధుడిగా, యాక్షన్ లవర్‌గా మీకు ప్రభాస్ తెలుసు. ఇప్పుడు ఆయన హృదయాన్ని తెలుసుకునే సమయం వచ్చింది. ప్రేమికుల దినోత్సవం రోజున మీరు నిజమైన ప్రేమను చూస్తారు’ అని పేర్కొంటూ 30 సెకన్ల వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ ఓ ప్రేమికుడిగా యంగ్ లుక్‌లో కనిపించి ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది.
కాగా..యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం క్లైమాక్స్ సీన్ల కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్ వేస్తున్నట్లు వార్లు వచ్చిన విషయం తెలిసిందే.