రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేశాక ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో ఇటీవలే తన ‘వకీల్ సాబ్’ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.
కాగా..’వకీల్ సాబ్’ షూటింగ్ ఫినిష్ కావడంతో మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్ సెట్స్ పైకి వచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ మూవీతో పాటు ప్యారలల్‌గా క్రిష్ సినిమాను పూర్తి చేయాలని ఫిక్సయ్యారట పవన్. ఇందులో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగ పాత్రలో కనిపించబోతున్నాడని, ఈ చిత్రానికి హరిహర వీరమల్లు అనే టైటిల్ పెట్టారని వార్తలు వచ్చాయి.
కాని తాజా సమాచారం ప్రకారం ‘వీరమల్లు’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడట. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది.