రాజకీయాల నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి మళ్ళీ సినిమాల స్పీడ్ ని పెంచారు. ఖైది నెంబర్ 150, సైరా సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకులనను ఆకట్టుకున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నాడు. ఇది చిరంజీవికి 152 సినిమా కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య విడుదల కానుంది. ఆ రోజు మెగా అభిమానులకు పండుగ చేసుకోనున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే తన తదుపరి చిత్రాన్ని చిరంజీవి పలువురు దర్శకులతో సినిమాలు చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. అందులో ఒకటి మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా. ఇది లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ చిత్రం వేదాళం రీమేక్‌లోనూ చిరంజీవి నటించబోతున్నారు. దీనికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలు కాకుండా మరో సినిమాను చిరంజీవి ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమా రూపొందనుంది. ఈ విషయాన్ని చిరంజీవి స్టేజ్‌పై అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ కూడా ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు చిరంజీవి దూకుడు చూస్తుంటే.. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.