చిత్రపరిశ్రమలో వారసత్వం ఉంటే అవకాశాలు తొందరగా వస్తాయి.. కానీ సక్సెస్ రాదండోయ్.. సత్తా నిరూపించుకుంటే తప్ప ప్రేక్షకులు క్లాప్స్ కొట్టరు. అక్కినేని నట వారసుడిగా భారీ అంచనాల మధ్య వచ్చి, కథానాయకుడిగా నిలదొక్కుకున్నారు నాగచైతన్య. తాత ఏఎన్నార్, తండ్రి నాగార్జునలా ఈ కుర్రాడిలోనూ జోష్ ఉందనుకున్నారు ప్రేక్షకులు. కమర్షియల్ సినిమాలతోపాటు వాస్తవికత ప్రధానంగా సాగే కథాంశాలతో వైవిధ్యతను చాటుకున్నారు. ఇమేజ్‌లకు కట్టుబడిపోకుండా.. కొత్తదనాన్ని నమ్ముకుని కథలు ఎంపిక చేసుకుంటున్నారు
కాగా.. నాగ చైతన్య ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ తరుణ్‌భాస్కర్ ఒక కథను చైతన్యకి వినిపించాడట. అందులో హీరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. ఈ సినిమా కథ నచ్చడంతో నాగ చైతన్య కూడా వెంటనే అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కాగా..ఈ యువ హీరోను తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తారన్న వార్తలు రావడంతో అక్కినేని అభిమానులు ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.ఈ సినిమాకు పవన్ సంగీతం అందించారు. దేవయాని, రావురమేశ్, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేశ్, తాగుబోతు రమేశ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.