కరోనా మహమ్మారి కారణంగా ఏడాదికాలంగా అభిమానులు ప్రత్యక్షంగా క్రికెట్‌ను చూడలేకపోతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభన తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం షరతులతో వీక్షకులకు అనుమతి ఇచ్చింది. దాంతో భారత్,ఇంగ్లాండ్ రెండో టెస్టుకు అభిమానులను అనుమతించారు. మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి. స్టేడియం సామర్థ్యంలో 50 శాతం వరకు టికెట్లు ఇస్తున్నారు. రెండో టెస్టు టికెట్ల పంపిణీని గురువారం ఆరంభించారు.
కాగా,నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు చెన్నై వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, రెండో టెస్టు కూడా ఫిబ్రవరి 13 నుంచి చెన్నై వేదికగానే జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. చెపాక్ స్టేడియం టికెట్ కౌంటర్ల వద్ద భారీ సంఖ్యలో నిలబడ్డారు. చాలా రోజుల తర్వాత ప్రత్యక్షంగా మ్యాచ్ ను చూడాలని ఎక్కువగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్టేడియం వద్ద సందడి నెలకొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
కాగా,చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య భారత జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. ఆసీస్ గడ్డ మీద సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా పూర్తి జట్టుతో బరిలోకి దిగడమే దీనికి కారణం. కానీ ఫలితం మాత్రం ఆశించిన దానికి భిన్నంగా వచ్చింది.