మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలైంది.కాగా, తొలి రోజే పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘ఉప్పెన విడుదలైన అన్నిచోట్ల నుండి హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు చాలా చాలా థాంక్స్. నాకు ఇది అద్భుతమైన క్షణం. ఒక శిష్యుడు గురువుని చేసిన రోజు ఇది. ఉప్పెన లాంటి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చి నన్ను నిజమైన గురువుని చేసాడు బుచ్చి. చాలా గొప్పగా ఫీలవుతున్నాను.నేను ఎప్పుడూ ఏరా, ఏంట్రా బుచ్చి అని పిలిచేవాడ్ని. కానీ ఈ సినిమా చూసి బయటికి వచ్చి ఏరా బుచ్చి అని పిలవటానికి సంకోచించి.. బుచ్చి అన్నాను. అదే ఈ సినిమా సక్సెస్‌కి నిదర్శనం.” అంటూ సుకుమార్ పేర్కొన్నాడు.
మరోవైపు చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. “ఉప్పెన చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అన్ని ఏరియాలనుండి పెద్ద హిట్ టాక్ వచ్చింది. మా గురువుగారు సుకుమార్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఉప్పెన సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులందరికీ నా ధన్యవాదాలు..” అంటూ పేర్కొన్నారు.