రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ వివాదానికి తెరలేపింది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ పట్ల బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా తాను నిర్మించిన ‘మైదాన్’ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ఆరు నెలల ముందే ప్రకటించినప్పటికీ అదే నెలలో 13న ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా బోనీకపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఓకేన్నెలలో రెండు రోజుల తేడాతో ఒకే హీరో నటించిన సినిమాలు విడుదల చేయడం దురదృష్టకరం..’ఆర్ఆర్ఆర్’లో అజయ్‌దేవ్‌గణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నేను నిర్మాతగా వ్యవహరిస్తోన్న ‘మైదాన్’లో అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను గతేడాదిలోనే విడుదల చేయాలనుకున్నాం. అయితే కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. సినిమా కోసం మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే ఖర్చుపెట్టాం. ఈ ఏడాదిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించిన సమయంలోనే అక్టోబర్ 15న ‘మైదాన్’ విడుదల చేస్తామని ప్రకటించాం. మా సినిమా విడుదల తేదీని ప్రకటించిన కొన్ని రోజులకే ‘ఆర్ఆర్ఆర్’ని అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు రాజమౌళి, ఇతర చిత్రబృందం తెలిపింది. ఒకే హీరోకు చెందిన రెండు భారీ సినిమాలు కేవలం రెండు రోజుల తేడాతో విడుదల కావడం దురదృష్టకరం అని బోనీకపూర్ పేర్కొన్నారు.
అలాగే ఈ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల తేదీపై ఇటీవల నేను రాజమౌళితో ఫోన్లో మాట్లాడాను. విడుదల తేదీతో తనకు సంబంధం లేదని.. అది నిర్మాతల ఇష్టప్రకారం జరిగిందని ఆయన నాతో చెప్పారు. కానీ, ఆయన మాటల్ని నేను నమ్మాలనుకోవడం లేదు. అని బోనీకపూర్ చెప్పుకొచ్చారు.