రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో దిల్ రాజు, శిరీష్ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. కాగా, దర్శకుడు శంకర్, నిర్మాతలు దిల్ రాజు-శిరీష్‌తో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని చరణ్ ట్వీట్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమా మా సంస్థకు ఓ మైలురాయి. చిత్రనిర్మాణ రంగంలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతోంది. ఇప్పుడు మా సంస్థలో ప్రతిష్ఠాత్మకమైన 50వ చిత్రాన్ని రామ్‌చరణ్, శంకర్ వంటి క్రేజీ కాంబినేషన్లో నిర్మిస్తున్నాం. త్వరలో ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తాం అని పేర్కొన్నారు. అయితే, త్వరలోనే ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..
◆ ‘చిరుత’తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌కు కూడా ఇది 15వ చిత్రం.
◆ దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా.
◆ డైరెక్టర్ శంకర్ తొలిసారి నేరుగా తెలుగులో అదికూడా తెలుగు కథానాయకుడితో సినిమా తీస్తున్నారు.
◆ ‘జెంటిల్మెన్’తో ఎంట్రీ ఇచ్చిన శంకర్‌కు దర్శకుడిగా ఇది 15వ సినిమా కావడం విశేషం.
◆ పాన్ ఇండియా సినిమా కావడంతో నటీనటులను కూడా అన్ని భాషల నుంచి తీసుకోనున్నారు.
◆ ఇప్పటివరకూ మెగా పవర్ స్టార్ చేయని ఓ సరికొత్త పాత్రలో శంకర్ చరణ్ ను చూపించనున్నారు.