వైవిధ్యమైన చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపించే టాలీవుడ్ హీరో సుమంత్ మరో విభిన్నమైన పాత్రలో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన నటించిన తాజా సినిమా ‘కపటధారి’. కన్నడలో సూపర్ హిట్ సాధించిన `కావలుధారి` సినిమాకు ఇది రీమేక్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సుమంత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించారు. కాగా, ఆర్కియాలజీలో ఎప్పుడో జరిగిన హత్య… హంతకుడు ఎవరో తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అంతు పట్టని ఆ హంతకుడు రహస్యాన్ని ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎలా చేధించాడనే కథాంశంతో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కపటధారి’.
ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని డా.ధనంజయన్ నిర్మించారు. సైమన్ కె.కింగ్ సంగీతం అందిస్తున్నారు. నాజర్, సంపత్, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర థీమ్ ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.
అయితే, ఇప్పటి వరకు చేసిన ‘కపటధారి’ చిత్రయూనిట్ వైవిధ్యంగా చేసిన ప్రమోషన్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇదిలావుంటే.. ఫిబ్రవరి 16 రోజున ‘కపటధారి’ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.