నందమూరి కథానాయకుడు కల్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 19వ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడకన్ నెం.14 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
కాగా, పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి యువ దర్శకుడు బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. దర్శకులు భరత్ కమ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో కల్యాణ్ రామ్, నిర్మాత నవీన్ ఎర్నేని, సీఈఓ చెర్రీ .. సినిమా డైరెక్టర్ రాజేంద్రకు స్క్రిప్ట్‌ను అందించారు.కాగా, మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాలో హీరోయిన్ సహా ఇతర నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది.
ఇదిలావుంటే.. ప్రస్తుతం హీరో కళ్యాణ్ రామ్ భారీ హిట్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సరికొత్త కథలను ఎంచుకొని ప్రేక్షకులను అలరించాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఇటీవల కళ్యాణ్ రామ్ రావణుడి పాత్రలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమా ఇదేనా అని కూడా ఇప్పుడు సందేహాలు వస్తున్నాయి. అంతేకాకుండా నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ పలు సినిమాలు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమాకు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తను హీరోగా చేసేందుకు పలు వైవిధ్యమైన కథలను వింటున్నారు.