‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తునన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘పుష్ప’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
కాగా, ‘పుష్ప’ సినిమా విషయంలో సుకుమార్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినిమా కథ ప్రకారం ఎక్కువ భాగం అడవుల్లోనే సాగుతుంది. అందుకే అప్పట్లో థాయ్ లాండ్ అడవులకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో ఉన్న అడవుల్లోనే షూటింగ్ కొంతవరకు చేసారు చిత్రబృందం. కానీ అప్పుడు కరోనా వచ్చి యూనిట్ లో ఒకరు చనిపోవడంతో మళ్లీ వెనక్కి తగ్గాడు సుకుమార్.
ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు సుకుమార్. ఇప్పటి పరిస్థితుల్లో ఎలాంటి రిస్కులు తీసుకోవడం మంచిది కాదని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకే ఇకపై ఔట్ డోర్ షూటింగ్ వద్దని చిత్రయూనిట్ కు చెప్పినట్లు సమాచారం. ఇకపై అడవుల సెట్ ఏదో హైదరాబాద్ లోనే వేద్దామని చిత్రనిర్మాతలకు కూడా సుకుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ కూడా దీనికి ఓకే చెప్పడంతో హైదరాబాద్ లోనే పుష్ప కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేసినట్లు సమాచారం. ప్రతీసారి ఔట్ డోర్ షూటింగ్ అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం అవుతున్నందుకే సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.