టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున కొత్త చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘పిఎస్వి గరుడవేగ’తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు రూపొందించనున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో నిర్వహించారు. పశుసంవర్థకశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ గణేష్ ఆలయం అత్యంత శక్తిమంతమైనదని, సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందని అన్నారు.
కాగా, బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను సోమవారం పూర్తి చేసుకున్న నాగార్జున, మంగళవారం.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రారంభించడం విశేషం. ఈ నేపథ్యంలో నాగార్జున మాట్లాడుతూ…నా కెరీర్లో ఇప్పటివరకు ముందు రోజు ఓ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని, ఆ తర్వాతి రోజునే కొత్త సినిమాను ప్రారంభించడం ఇదే తొలిసారి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఇది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్. చాలా రోజుల తర్వాత నేను ఈ ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాను అని నాగార్జున అన్నారు.
మరోవైపు బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం ఇండియన్ వైడ్ ప్రేక్షకలోకం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది.