టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస విజయాలతో ఫుల్ ఫాంలోకి వచ్చాడు. ఇటీవల సంక్రాంతికి ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ తర్వాతి సినిమా తాజాగా ఫిక్స్ అయింది. అయితే, గతకొంతకాలంగా రామ్ తన తర్వాతి చిత్రాలని లింగుస్వామి, నేసన్, త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్స్‌తో చేయనున్నట్టు ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా రామ్ 19వ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. ‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన లింగుస్వామి దర్శకత్వంలో తన తదుపరి సినిమా ఉంటుందని ప్రకటించాడు.
సిల్వర్ స్కీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్‌లో చిత్రం సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తుండగా, ఈ మూవీని తెలుగు, తమిళ భాషలలో రూపొందించనున్నారు. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు మరి కొద్ది రోజులలో తెలియజేస్తామని చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు రామ్ ఈ ఏడాదిలో విడుదలైన ‘రెడ్’ చిత్రంతో హుషారుగా ఉన్నారు. 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి మాస్ ప్రేక్షకుల నాడి కూడా పట్టుకున్నారు.