మలయాళంలో 2013లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం దృశ్యం. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక భాషల్లో రీమేక్ అయింది. గత దశాబద్ధంలో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో దృశ్యం ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్ అయింది. చైనీస్ భాషలోనూ రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఏడేళ్ల తర్వాత దృశ్యానికి సీక్వెల్ తెరకెక్కించాడు దర్శకుడు జీతూ జోసెఫ్. మొదటి భాగంలో నటించిన మోహన్‌లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటించారు. ఈ మధ్యే సినిమా ట్రైలర్ రిలీజవగా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నారు.
అయితే, దృశ్యం తెలుగు రీమేక్‌లో నటించిన టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ ఇప్పుడు దాని సీక్వెల్‌పైనా దృష్టి సారించాడు. ఈ సినిమాను ఇటీవలే చూసిన వెంకీ సీక్వెల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు జీతూజోసెఫ్ డైరెక్షన్ లో రానున్న తెలుగు వెర్షన్లో నటించేందుకు అగ్రిమెంట్ కూడా రాసుకున్నాడని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కాగా, వెంకటేష్ ఇప్పటికే దృశ్యం 2కు డేట్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎఫ్3 షూటింగ్‌తో బిజీగా ఉన్న వెంకటేష్, దీంతోపాటు దృశ్యం 2 షూటింగ్ లో కూడా పాల్గొననున్నట్టు సమాచారం. ఇక వరుణ్ తేజ్‌తో కలిసి చేస్తున్న ‘ఎఫ్ 3’ ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కానుంది.