పాన్ ఇండియన్ ట్రెండ్ పెరిగిన తర్వాత టాలీవుడ్ కథానాయకులు ఇతర భాషల్లో తమ మార్కెట్‌ను విస్త్రతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ దిశగా అడుగులు వేయబోతున్నట్లు సమాచారం. కోలీవుడ్‌లో ఆయన అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో బన్నీ తమిళ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇద్దరి మధ్యా ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా యాక్షన్ డ్రామా లేదా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుందంట. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది.
వాస్తవానికి అల్లు అర్జున్ ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇన్నాళ్లకు బన్నీ మళ్లీ ఓ తమిళ సినిమా చేసేందుకు రంగం సిద్ధం అయింది. కాగా, ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా కూడా ప్రకటించాడు. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాతో పాటు గౌతమ్ మీనన్ సినిమాలో నటిస్తాడా.. లేదా.. ముందు కొరటాల శివ సినిమా పూర్తి చేసి.. ఆ తరువాత గౌతమ్‌తో సినిమా చేస్తాడా అన్నది చూడాలి.