అల్లరి సినిమాను తన ఇంటి పేరుగా మార్చుకున్న విలక్షణ నటుడు అల్లరి నరేష్. గతంలో వరుస కామెడీ చిత్రాలతో హిట్లు కొట్టిన నరేశ్ గత కొన్నేళ్లుగా ప్లాప్‌లతో సతమతమవుతున్నాడు. దీంతో తన కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టి ప్రయోగంగా ‘నాంది’ సినిమా చేశాడు. శుక్రవారం(ఫిబ్రవరి 19) విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా అల్లరి నరేష్ నటనపై ప్రశంసల జల్లు కురుస్తుంది.
అయితే, ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించారు చిత్రయూనిట్ సభ్యులు. ఈ కార్యక్రమంలో అల్లరి నరేష్ ఎమోషనల్ అయ్యారు. గత కొన్నేళ్లుగా సక్సెస్ చూడని నరేష్ ఈ ‘నాంది’ సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కారు. ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు అల్లరి నరేష్. నాంది సినిమాలో తండ్రిగా నటించిన దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకొని ఏడ్చేశారు. 2012 ఆగస్టులో ‘సుడిగాడు’ హిట్ తర్వాత తన కెరీర్లో పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా నాంది అని, ఈ విజయం కోసం ఎనిమిదేళ్ల పాటు ఎదురుచూశానని నరేష్ అన్నారు.
అయితే, వరుసగా ఎనిమిదేళ్లు పరాజయాల్లో ఉన్నా కూడా తనకు ధైర్యం చెబుతూ ఓ మంచి సినిమా చేద్దామని సతీష్ వేగేశ్న ప్రోత్సహించారని, తన రెండో ఇన్నింగ్స్‌కి ‘నాంది’తో దర్శకుడు విజయ్ కనకమేడల పునాది వేశారని తెలుపుతూ నరేష్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.