అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నాంది’. శుక్రవారం (19న) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై సతీశ్ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే, విడుదలైన తొలి రోజే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. నరేశ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇక చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ సినిమాకు హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ‘నాంది’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ‘నాంది’ ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 49 లక్షలు షేర్, రూ. 72 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5.5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2.2 లక్షలు, గుంటూరులో 3.5 లక్షలు, కృష్ణాలో 3.2లక్షలు, నెల్లూరులో రూ.2 లక్షలు, ఓవర్సీస్లో రూ.2 లక్షలు కలెక్షన్లు రాబట్టింది.
కాగా, ఇప్పటికే ‘నాంది’ సినిమాకి రూ. 2.70 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని రూ. 3 కోట్లుగా నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమా తొలి రోజు రూ. 49 లక్షలు వసూలు చేయడంతో.. లక్షాన్ని చేరుకోవాలంటే మరో రూ. 2.51 కోట్లు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. శని, ఆదివారాలు రావడం, సినిమాకు హిట్ టాక్ రావడంతో మరో రెండు రోజుల్లో నాంది కలెక్షన్లు భారీగా ఉండోచ్చని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.