యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దూకుడు మీదున్నారు. 2021 ఆరంభం నుంచే తన జోరు ప్రదర్శిస్తూ ఇప్పటికే కమిటైన సినిమాలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు ప్రభాస్. ఇప్పటికే ‘సలార్’ సెట్స్ మీదకొచ్చేసిన యంగ్ రెబల్ స్టార్.. ఇటీవలే ఆయన నటించబోతున్న మరో బిగ్గెస్ట్ మూవీ ఆదిపురుష్ ప్రారంభించేశారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనుంది ‘ఆదిపురుష్’ మూవీ. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. పౌరాణిక గాథ రామాయణంను ఈ ‘ఆదిపురుష్’ రూపంలో చూపించనున్నారట. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండటం ఆయన అభిమానుల్లో సరికొత్త ఆతృతను నింపేసింది. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, ఇతర అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.
అయితే, ప్రభాస్ కెరీర్లో 22వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా నుండి శ్రీరామనవమి సందర్భంగా అంటే ఏప్రిల్ 21న సాలిడ్ అప్డేట్ ఒకటి రానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కౌసల్య పాత్రలో హేమమాలిని, దశరథుడి పాత్రలో కృష్ణంరాజు , లక్ష్మణుడి పాత్రలో టైగర్ ష్రాఫ్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారని సమాచారం.