గత రెండుళ్లుగా రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్.. నిర్మాతలు, అభిమానుల కోరిక మేరకు తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేసిన ఆయన, ఏ మాత్రం విరామం తీసుకోకుండా తన తదుపరి సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. ఓ వైపు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తూనే, మరోవైపు డైరెక్టర్ క్రిష్ సినిమాను, హరీష్ శంకర్ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు పవన్. బిజీ షెడ్యూల్లో కూడా డేట్స్ ఇవ్వడంతో డైరెక్టర్ క్రిష్, హరీష్ శంకర్ తమ సినిమాల షూటింగ్స్ వేగాన్ని పెంచేశారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన 29వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘రేసుగుర్రం’ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్‌రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్ లో #PSPK29 ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పవన్ ఇమేజ్ కు సరిపోయేలా ఓ కథను వంశీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఆదివారం( ఫిబ్రవరి 21) వంశీ పుట్టినరోజు సందర్భంగా.. పలువురు అభిమానులు, సినీ విశ్లేషకులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్‌డే విషెస్ పోస్టులు పెడుతూ #PSPK29 అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. దీంతో పవన్ కళ్యాణ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను వక్కంతం వంశీ కథతో ఓకే చేసేశారని అందరూ చెప్పుకుంటున్నారు. మరోవైపు.. హరీశ్ శంకర్ సినిమా తర్వాత పవన్, పూరీ జగన్నాథ్‌తో సినిమా చేసే అవకాశాలున్నాయంటూ కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.